ఈ రెండే ఓటీటీ ఆశలు నిలబెట్టాయ్..

కృష్ణ అండ్ హిజ్ లీల‌, భానుమ‌తి & రామ‌కృష్ణ‌.. గత రెండు వారాల్లో ఓటీటీ వేదికలపై విడుదలై మంచి టాక్ సాధించిన చిన్నసినిమాలు.  ఈ రెండు సినిమాలు లవ్ స్టోరీలే కావడం విశేషం. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన కృష్ణ అండ్ హిజ్ లీల.. ముఖ్యంగా యువత ను ఆకట్టుకుంది.  కథ నుంచి టేకింగ్ వరకు అంత ఫ్రెష్ కాన్సెప్ట్ తో ఇప్పటి వాళ్ళకి నచ్చే విధంగా నిర్మించారు. ముందు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా యాప్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది.  సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా, శ్రద్దా శ్రీనాథ్, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి  హీరోయిన్లుగా న‌టించారు. ఇక నవీన్ చంద్ర, సలోనీలుత్రా జంటగా నటించిన ‘భానుమతి అండ్  రామకృష్ణ’. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ వీక్షకులని మెప్పించిందనే చెప్పాలి. సహజత్వానికి దగ్గరగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సినిమా గంటన్నరే అయినప్పటికీ.. ఎమోష‌న్స్‌,  డైలాగ్స్ సినిమాని నిలబెట్టాయి. 

ప్రస్తుతం సినిమా థియేటర్లు లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ దిగ్గజాలు దీన్ని ఒక అవకాశంగా మలుచుకుని దూసుకెళ్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఓటీటీల్లో నేరుగా విడుదల అయిన సినిమాలు నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. తెలుగులో అమృతరామం నుంచి.. అమితాబ్ గులాబో సితాబో, జ్యోతిక పొన్ మగాళ్ వందాల్, కీర్తి సురేష్ పెంగ్విన్ వరకు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పొచ్చు. ఈ సినిమాలంటికి ప్లాప్ నుంచి బీలో యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. ఒక మంచి హిట్టు పడాల్సిన అవసరం వచ్చిన సమయంలో కృష్ణ అండ్ హిజ్ లీల‌, భానుమ‌తి & రామ‌కృష్ణ‌ సినిమాలు ఓటీటీ సంస్థల ఆశలను నిలబెట్టాయి.  ఇక ఈ నెల 15 న సత్య దేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్ వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. హిందీలో సైతం వరుసగా సినిమాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అమితాబ్ ఝున్డ్, కాంచన రీమేక్ లక్ష్మి బాంబ్, జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మల్టీస్టారర్ చలాంగ్, శకుంతల దేవి, కూలీ నె౦ .1 వంటి పెద్ద సినిమాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలు ఓటీటీల  భవిష్యత్ ని ఏ విధంగా మారుస్తాయా మరి. 

కొత్త సినిమాలు వచ్చేశాయ్..

కరోనా వైరస్ ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ సమయంలో సినీ ప్రేమికులను ఆదుకున్నది ఓటీటీ యాప్ లే. ఈ వేదికలపై తెలుగు సినిమాలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ముందు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్న ఓటీటీలు.. ఇప్పుడు పెద్ద సినిమాలను దక్కించుకోవడంలో పోటీపడుతున్నాయి. కరోనా కి ముందు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి చేరువ కాలేని సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఈ నెలలో చాలా సినిమాలు డిజిటల్ ప్రేక్షకులను అలరించనున్నాయి. ఏప్రిల్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో హిట్ సాధించినవి కూడా ఉన్నాయి. వచ్చే రెండు వారాల్లో రానున్న సినిమాలు, ఏ ఏ యాప్ లపై వీక్షించొచ్చనే వివరాలు చూస్తే..

1 ) భీష్మ

యంగ్ హీరో నితిన్ రెండేళ్ల నిరీక్షణకు తెర దించుతూ హిట్ అందించిన సినిమా భీష్మ. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టగలిగింది. అయితే కరోనా వైరస్ వల్ల థియేటర్స్ మూతపడటంతో కొంత వసూళ్లు తగ్గాయనే చెప్పాలి. భీష్మ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ నెల 27 న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఇంటిల్లిపాది ఈ సినిమాను చూడొచ్చు. వెంకీ కుడుముల డైరెక్షన్ చేసిన భీష్మలో రష్మిక మందన్నా కథానాయిక.

2) కనులు కనులను దోచాయంటే

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది కనులు కనులను దోచాయంటే. దుల్కర్ సాల్మన్, రీతూ వర్మ జంటగా వచ్చిన ఈ డబ్బింగ్ సినిమా చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే పాజిటివ్ టాక్ తో హిట్ గా దూసుకెళ్లింది. కరోనా లేకుంటే మరిన్ని వసూళ్లు రాబట్టి ఉండేది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఇండియా కొనుగోలు చేసింది. 17 నుంచి ప్రేక్షకులకి అందుబాటులో రానుంది.

3) వరల్డ్ ఫేమస్ లవర్

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వచ్చాడు. ఎప్పుడు కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుండే విజయ్.. ఇందులో కూడా తనదైన మార్క్ చూపించాడు. మధ్య తరగతి భర్తగా, సింగరేణి కార్మికుడిగా, భగ్న ప్రేమికుడిగా మంచి వేరియేషన్స్ చూపించాడు.అయితే ఈ సినిమా కు ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమా హక్కులు దక్కించుకున్న సన్ నెక్స్ట్ ఏప్రిల్ 15 న అందుబాటులోకి తీసుకురానుంది.

4) అశ్వథ్థామ

లవర్ బాయ్ ఇమేజ్ వదులుకుని మరి ‘అశ్వథ్థామ’తో యాక్షన్ హీరో అవతారమెత్తాడు నాగ శౌర్య. ముందు సినిమాలు ప్లాప్ కావడంతో ఈ సినిమాపై చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు. జనవరి చివర్లో విడుదల అయిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అశ్వథ్థామ ఏప్రిల్ 17 న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.

5) రూలర్

బాలకృష్ణ ‘రూలర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. పాత చింతకాయ కథకు అవుట్ డేటెడ్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్‌ తోడవ్వడంతో బాలకృష్ణకి హ్యాట్రిక్ పరాజయాలు తప్పలేదు. ఈ చిత్రం కూడా త్వరలోనే సన్ నెక్స్ట్ లో కనిపించనుంది.

ఇవే కాకుండా దర్బార్, హిట్, ఓ పిట్ట కథ, మధ, జాను, తూటా, రాజా వారు రాణి వారు, శక్తి, అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి వంటి సినిమాలు లభిస్తున్నాయి. చూడని వారు చూసెయ్యండి మరి.

Design a site like this with WordPress.com
Get started