ఇస్మార్ట్ భామలకు అన్నీ కలిసొస్తున్నాయ్!

నిధి అగర్వాల్, నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించడంతో ఈ ఇద్దరు భామల దశ ఒక్కసారిగా తిరిగింది. ఈ సినిమాకి ముందు వీళ్ళ కెరీర్ అంత గొప్పగా ఏమీ లేదు. అక్కినేని అబ్బాయిలతో నిధి చేసిన “సవ్యసాచి” “mr . మజ్ను” సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూశాయి. అభినయం పరంగా కూడా బొటాబొటి మార్కులే వచ్చాయి. అప్పట్లో ఈ సుందరి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని, డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో కొన్ని రోజులు హాట్ టాపిక్ అయ్యింది. ఇక ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో నభా నటేష్ తెలుగు తెరకి పరిచయం అయింది. ఇందులో సిరి పాత్రకి మంచి పేరు వచ్చింది. అయినా అవకాశాలు మాత్రం దొరకలేదు.

ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇద్దరూ నటించిన ఇస్మార్ట్ శంకర్ వీళ్ళ కెరీర్ ని మలుపు తిప్పింది. ప్రస్తుతం నిధి తమిళంలో జయం రవికి జంటగా ‘భూమి’ అనే సినిమా చేస్తోంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ అవకాశం నిధిని వరించింది. నభా నటేష్ కూడా ఖాళీగా లేదు. రవితేజ కొత్త చిత్రం “డిస్కో రాజా” లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరిలో రిలీజ్ కానుంది.

ఈ మధ్య ప్రతి అవార్డ్స్ ఫంక్షన్ లోను ఈ ఇద్దరు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తే మరిన్ని అవకాశాలు వీరి ఖాతాలో పడేలా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామలు ఎప్పటికప్పుడు తమ ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి దగ్గరవుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరతను వీళ్ళు ఎంత వరకు భర్తీ చేస్తారో చూడాలి మరి.

నువ్వానేనా అంటున్న విజయశాంతి, టబు..

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే అందరి దృష్ఠి మాత్రం రెండు సినిమాలపైనే ఉంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరెకెక్కుతోన్న అలవైకుంఠపురములో వాటిలో ఒకటైతే.. రెండోది మహేశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ రెండూ ఒకే రోజున రిలీజవనున్నాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి వెండి తెరపై రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గిన లేడీ అమితాబ్ మునుపటి విజయశాంతిలా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె రాజకీయ నాయకురాలిగా కనిపించనుందని సమాచారం. ‘అలవైకుంఠపురములో’ కీలకపాత్రలో టబు కనిపించనుంది.

ఈ ఇద్దరూ ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు. ఇప్పటికీ వారికి చాలామంది అభిమానులే ఉన్నారు. నటనలో ఎవరికి వారే సాటి. వైవిధ్యమైన సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ ఒకే రోజు వెండితెరపై ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎవరు ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తారో సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.