సూర్యుడి అనుగ్రహం కోసం జలం ఎలా సమర్పించాలంటే..

శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సమస్త సృష్టికి జీవనాధారం. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యుడిని పూజిస్తే మన జ్ఞాన సంపద పెరుగుతుంది. సూర్య కిరణాలు మనపై ప్రసరించడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకే సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అని కూడా పిలుస్తుంటారు. ఆ సూర్యుడి కృపను పొందడానికి సూర్యుడికి జలాన్ని సమర్పిస్తుంటారు. దీన్నే అర్ఘ్యం సమర్పించడం అంటూ ఉంటారు. ఒకప్పుడైతే.. చెరువులు, కాలవలు, నదుల్లో స్నానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత అర్ఘ్యం సమర్పించేవారు. ఇప్పుడు మనం బాత్రూంల్లోనే స్నానం చేస్తున్నాం. ఇలాంటప్పుడు సూర్యునికి నీరు ఎలా సమర్పిస్తాం? దానికి ఏదైనా మార్గం ఉందా? జలాన్ని ఎలా సమర్పిస్తే.. సూర్యుడి అనుగ్రహం దక్కుతుంది? తెలుసుకుందాం.

సూర్యుడికి మనం సమర్పించేది జలమే అయినప్పటికీ ఓ పద్ధతి ప్రకారం చేస్తేనే దానికి ఫలితాన్ని పొందగలుగుతాం. సూర్యునికి జలం సమర్పించడానికి మనకి ఏం కావాలంటే.. శుభ్రమైన నీరు, చిన్న బెల్లం ముక్క లేదా తేనె, కొద్దిగా బియ్యం, కొంచెం కుంకుమ. వీటిన్నింటిని శుభ్రమైన రాగి పాత్రలో వేసి వాటిని సూర్యుడికి సమర్పించాలి. ఇలా సమర్పించేటప్పుడు మనం కొన్ని సూత్రాలు పాటించాలి.

సూర్యునికి జలం సమర్పించడానికి అనువైన సమయం ఉదయం ఆరు నుంచి ఏడు గంటలు. ఆ సమయంలో సూర్యుని కిరణాలు తీవ్రంగా ఉండవు. పైగా ఆ సమయంలో మన శరీరంపై సూర్యకిణాలు ప్రసరిస్తే.. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. పైగా ఈ సమయంలో సూర్యుని అర్చిస్తే.. ఇతర గ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ఆ సమయానికంటే ముందే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత మనం పైన చెప్పుకున్న విధంగా రాగిపాత్రను సిద్ధం చేసుకోవాలి.

సూర్యునికి జలాన్ని సమర్పించేటప్పుడు మీ రెండు చేతులతో రాగిపాత్రను వీలైనంతపైకి ఎత్తాలి. ఆ తర్వాత నీటిని నెమ్మదిగా కిందికి పోస్తూ ఉండాలి. అలా పోస్తున్న నీటిధార మధ్య నుంచి సూర్యున్ని చూస్తూ ‘ఓం సూర్యాయ నమ:’ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి. కాబట్టి మీరు మంత్రం జపించే వేగాన్ని బట్టి నీటి ధార వేగం ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

ఆ తర్వాత నీరు సమర్పించిన చోట అంటే.. నీరు నేల మీద పరుచుకున్నచోట కుడి చేతి వేళ్లతో తాకి మొదట నుదురుకి రాసుకోవాలి. ఆ తర్వాత మరోసారి నీటిని తాకి.. కళ్లకు, కంఠానికి చేతివేళ్లను తాకించాలి.

సూర్యునికి నీరు సమర్పించిన అనంతరం ఆ ప్రాంతాన్ని తుడవకూడదు. ఆ నీటిని వాటంతట అవే ఇంకిపోయేలా లేదా ఆరనివ్వాలి. అలాగే సూర్యునికి సమర్పించిన నీటిలో ఎట్టి పరిస్థితుల్లో కాలు పెట్టకూడదు.

ఒక వేళ సూర్యుడు కనిపించకపోతే.. ఆరోజు ఎప్పటి మాదిరిగానే తూర్పు వైపుకి తిరిగి జలాన్ని సమర్పించాలి.

సూర్యునికి స్వచ్ఛమైన మనసుతో, సంపూర్ణ భక్తి ప్రపత్తులతో జలాన్ని సమర్పిస్తే.. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు మానసిక ప్రశాంతత కూడా మీకు దక్కుతుంది.

Design a site like this with WordPress.com
Get started